Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్

Shubman Gill Reaction

Shubman Gill Reaction

Shubman Gill on 405-Run Target: బుధవారం వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ (133 బంతుల్లో 223 పరుగులు)తో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్, భారత్ భారీ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. స్కోర్ బోర్డుపై 405 పరుగులు చూసి తాము కంగారుపడిపోయాం అని, కానీ అంతా సవ్యంగా సాగిందని చెప్పాడు. రోహిత్ భాయ్ తనకు బాగా సహకరించాడని గిల్ ప్రశంసలు కురిపించాడు.

అంత సులభం కాదు:

‘గువాహటిలో మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉండటంతో నా శరీరంలోని ప్రతి భాగంలోనూ క్రాంప్స్ (కండరాలు పట్టేయడం) వచ్చాయి. వెస్టిండీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి.. మేము అప్పటికే 20-25 ఓవర్లు ఫీల్డింగ్ చేసినంత అలసటగా అనిపించింది. గువాహటిలో అంత వేడి, ఉక్కపోత ఉంది. అయినా మా ఫీల్డర్లు మైదానంలో బాగా కదిలారు. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. వికెట్ ఎంత బాగున్నా, మైదానం ఎంత చిన్నదైనా ఇలాంటి భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. విజయం సాధిస్తామా అనే సందేహం నాలో కలిగింది. అయితే మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చడం చాలా సంతోషంగా ఉంది’ అని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

రహస్యం ఏమీ లేదు:
‘నా ప్రస్తుత ఫామ్ వెనుక ప్రత్యేకమైన రహస్యం ఏమీ లేదు. మ్యాచ్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఆడటమే న టార్గెట్. పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 75-80 పరుగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కొత్త బంతితో కొంత స్వింగ్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్‌కు వికెట్ మరింత అనుకూలంగా మారుతుందని ముందుగానే అంచనా వేశాం. మైదానంలో ఒక వైపు బౌండరీ చిన్నగా ఉండటంతో ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పుడు ఆ వైపును లక్ష్యంగా చేసుకోవాలని భావించాం. 25 ఓవర్లకు 200-210 పరుగులు ఉంటే మంచి స్థితిలో ఉంటామని ముందే అనుకున్నాము. అయితే మేము 230-240 పరుగులు చేశాం. మధ్యలో వికెట్లు కోల్పోకపోవడం అదనపు ప్రయోజనంగా మారింది’ అని గిల్ పేర్కొన్నాడు.

మా బౌలర్లు రాణించలేదు:
‘పవర్‌ప్లేలో మా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి వన్డేలోనూ ఇదే సమస్య. వెస్టిండీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో ఒక దశలో వారు 420-430 పరుగులు చేసేలా కనిపించారు. అయితే డెత్ ఓవర్లలో మా బౌలర్లు బాగా బంతులు వేశారు. 25-30 పరుగులు తక్కువగా ఇవ్వడం కూడా ప్రయోజనంగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాము. మూడో వన్డేలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలను పరిశీలిస్తాం. ఇప్పటివరకు అవకాశం దక్కని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని తాను అనుకుంటున్నా. అప్పుడు భిన్నమైన కాంబినేషన్లను పరీక్షించడంతో పాటు ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు.