Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్‌ ఓటమిపై శుభ్‌మన్‌ గిల్ షాకింగ్ కామెంట్స్!

  • మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో భారత్ ఓటమి
  • 45వ ఓవర్ వరకు మ్యాచ్‌లోనే ఉన్నాం
  • 100-110 పరుగులు సాధించాలని ప్రణాళిక వేసుకున్నాం
Shubman Gill Reaction

Shubman Gill Reaction

Shubman Gill blamed the costly final overs for India defeat: ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా ఇంగ్లీష్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. భారీ ఛేదనలో భారత్‌ 7 వికెట్లకు 360 పరుగులే చేసి ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో టీమిండియా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ 45వ ఓవర్ వరకు తాము పోటీలోనే ఉన్నామని, కానీ చివరి ఓవర్లలో బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడం జట్టు ఓటమికి ప్రధాన కారణం అని గిల్ పేర్కొన్నాడు. చివరి మూడు ఓవర్లను గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ వేశారు. వరుసగా 16, 23, 23 రన్స్ ఇచ్చారు. ఈ మూడు ఓవర్లలోనే ఇంగ్లండ్ 62 రన్స్ పిండుకుంది. ఈ ముగ్గురే తమ ఓటమికి కారణం అని గిల్ చెప్పుకొచ్చాడు.

45వ ఓవర్ వరకు మ్యాచ్‌లోనే ఉన్నాం:

లార్డ్స్‌ వన్డే మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ’45వ ఓవర్ వరకు మేము పూర్తిగా మ్యాచ్‌లోనే ఉన్నాం. అయితే చివరి మూడు ఓవర్లలో 62 పరుగులు ఇచ్చాం. అక్కడే మ్యాచ్ మాకు దూరమైంది. అదే ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యాన్ని తీసుకొచ్చింది. 40 ఓవర్ల వరకు చేతిలో వికెట్లు ఉంటే మ్యాచ్‌లో గెలవగలం అని భావించాం. అదే సమయంలో రన్‌రేట్ కూడా చాలా వెనుకబడకుండా చూసుకున్నాం. పవర్‌ప్లే తర్వాత ఓవర్‌కు ఆరు నుంచి 7 పరుగుల చొప్పున స్కోరు చేస్తూ.. చివరి 10 ఓవర్లలో 100-110 పరుగులు సాధించాలని ప్రణాళిక వేసుకున్నాం. అలా జరిగి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని తెలిపాడు.

ఇంగ్లండ్ ఓపెనర్లు అద్భుతం:

సిరీస్‌లోని సానుకూల అంశాలపై స్పందించిన గిల్.. ‘ఈ సిరీస్‌లో దాదాపు ప్రతి బ్యాటర్ పరుగులు చేశాడు. బౌలర్లు కూడా వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మేము ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు. చాలా ఆఫ్‌లైన్ డెలివరీలు వేయడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇద్దరు బాగా ఆడారు. పవర్‌ప్లే తర్వాత వారు మాకు తిరిగి మ్యాచ్‌లోకి వచ్చే అవకాశమే ఇవ్వలేదు. చివరి ఓవర్లలో కూడా ఎక్కువ పరుగులు చేయడంతో వారు మ్యాచ్‌లో చాలా ముందుకెళ్లిపోయారు’ అని విశ్లేషించాడు.

రోహిత్ ఇన్నింగ్స్ అసాధారణం:

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు అందించిన సేవలను గిల్ కొనియాడాడు. ‘రోహిత్ భాయ్, కోహ్లీ భాయ్ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా భారత జట్టుకు అద్భుత సేవలు అందించారు. ఈ రోజు రోహిత్ భాయ్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. హిట్ మ్యాన్ ఆడిన విధానం ఎంతో ప్రత్యేకం. చివర్లో పిచ్ కొంత నెమ్మదిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో 138 పరుగులు చేయడం అంత సులభం కాదు. రోహిత్ బ్యాటింగ్ చూడటం నిజంగా అభిమానులకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది’ అని ప్రశంసించాడు. సిరీస్‌లో భారత్ ఓడిపోయినా.. బ్యాటింగ్ విభాగంలో పలువురు ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం, కీలక సమయంలో పోరాట పటిమ చూపించడం భవిష్యత్ టోర్నీలకు సానుకూల సంకేతమని గిల్ అభిప్రాయపడ్డాడు. అయితే పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.