Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • మిడిల్ ఆర్డర్‌పై శుభ్‌మన్ గిల్ ప్రశంసలు
  • భారత బౌలర్ల ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడిన గిల్
  • 2027 వన్డే ప్రపంచకప్ కోసం కొత్త కాంబినేషన్లు
Shubman Gill Statement

Shubman Gill Statement

Shubman Gill Reaction on India Win vs England 1st ODI: ఇంగ్లండ్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా 2-3 వికెట్స్ పడ్డాక అక్షర్‌ పటేల్‌ (57 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) బాగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారని ప్రశంసించాడు. ఆ సమయంలో మరో వికెట్ పడుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కాంబినేషన్లపై ప్రయోగాలు చేస్తున్నామని గిల్ వెల్లడించాడు.

మిడిల్ ఆర్డర్‌పై ప్రశంసలు:

మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన కెప్టెన్‌గా మాత్రమే కాదు.. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జట్టులో ప్రతి విభాగం బాధ్యత తీసుకుంటే విజయాలు మరింత సులభమవుతాయి. అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్‌ అయ్యర్‌ విలువైన పరుగులు చేశాడు’ అని తెలిపాడు.

అందుకే బౌలింగ్ ఎంచుకున్నా:

టాస్ గెలిస్తే ఎందుకు బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామో కూడా శుభ్‌మన్ గిల్ వివరించాడు. ‘మా బౌలింగ్ దళంలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్ మాత్రం అనుభవజ్ఞులతో బలంగా ఉంది. అందుకే మొదటి మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసి.. ప్రత్యర్థి 320 పరుగులు చేసినా వాటిని ఛేదించే సామర్థ్యం మా బ్యాటింగ్‌కు ఉందనే నమ్మకంతో ఆ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పాడు.

బౌలింగ్ మ్యాచ్‌ను టర్న్ చేసింది:

భారత బౌలర్ల ప్రదర్శనను గిల్ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘ఆరంభ 6-7 ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. కొత్త బంతి స్వింగ్ అవుతుండటంతో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాం. పవర్‌ప్లే చివర్లో ఇంగ్లండ్ కాస్త ఆధిపత్యం చెలాయించినా.. మిడిల్ ఓవర్లలో మేము అద్భుతంగా పుంజుకుని వరుసగా ఐదు వికెట్లు తీశాం. అదే మ్యాచ్‌లో కీలక మలుపు’ అని పేర్కొన్నాడు.

ప్రపంచకప్ కోసం కొత్త కాంబినేషన్లు:

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో విభిన్న కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని గిల్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఏ కాంబినేషన్ ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద టోర్నీల్లో బలమైన జట్టుతో బరిలోకి దిగేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నాం. ఇంగ్లండ్‌లోని పిచ్‌లు 2027 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణాఫ్రికా పరిస్థితులను పోలి ఉన్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి స్వింగ్ అవుతోంది. బౌన్స్ కూడా ఉంది. తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాంబినేషన్లను పరీక్షించడం ప్రపంచ కప్‌కు ఎంతో ఉపయోగపడుతుంది’ అని చెప్పాడు.