Team India: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కెరీర్ చరమాంకం దశకు చేరుకుంది. అతడు మహా అయితే మరో రెండేళ్లు మాత్రమే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంశంపై వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే సచిన్ ఉండగానే అలాంటి ఆటగాడు కోహ్లీ రూపంలో భారత్‌కు దొరికాడు. సచిన్, ధోనీ తర్వాత అంతటి స్థాయిలో కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో అతడి లాంటి ఆటగాడు టీమిండియాకు దొరికాడా అంటే కచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వన్డేల్లో కోహ్లీ స్థానంలో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న ఆశలు చిగురిస్తున్నాయి. గత ఐదారు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన చూస్తే టీమిండియాకు మరో కోహ్లీ దొరికేశాడన్న భరోసా కలగడం ఖాయం.
Read Also: Australia Beach Case: కుక్కు చేసిన ఆ చిన్న తప్పే.. ఆ యువతి హత్యకు కారణం
2017లో టీమిండియాలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 47 టీ20లు, 32 వన్డేలు, 5 టెస్టు మ్యాచులు ఆడాడు. నాలుగో స్థానంలో అనేక మంది ఆటగాళ్లను మార్చిన తర్వాత టీమిండియా ఆ స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్‌కు ఫిక్స్ చేసింది. అయ్యర్ ఆడిన ఆఖరి 10 వన్డేల్లో 549 పరుగులు చేశాడు. యావరేజ్ 68.62గా నమోదు కాగా స్ట్రేక్ రేట్ 96.65గా నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఆడిన వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ వరుసగా 80, 28 నాటౌట్, 113 నాటౌట్, 50, 44, 63, 54, 80, 26, 11 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేలు, సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో, ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో అయ్యర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లో కనుక అయ్యర్ రాణిస్తే వన్డేల్లో అతడి స్థానానికి ఢోకా ఉండదు. మరి కోహ్లీ జట్టులోనే ఉండగా శ్రేయస్‌కు టీమిండియా ఎలాంటి అవకాశాలు ఇస్తుందో వేచి చూడాలి.
Read Also: ఆ ఊరికి వెళితే 25 లక్షలు ఇస్తారు! మీకు అర్థమౌతుందా?