Site icon NTV Telugu

Shoaib Akhtar: ‘నో బాల్’ వివాదం.. షోయబ్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar On No Ball

Shoaib Akhtar On No Ball

Shoaib Akhtar Sensational Comments On No Ball: నిన్న పాకిస్తాన్‌పై భారత్ సాధించిన అఖండ విజయం సంగతిని పక్కన పెడితే.. చివరి ఓవర్‌లో మహ్మద్ నవాజ్ వేసిన ‘నో బాల్’పై ఇప్పటికీ దుమారం రేగుతూనే ఉంది. ముఖ్యంగా.. పాకిస్తాన్ ప్రేక్షకులైతే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అది నో బాల్ కాకపోయినా.. విరాట్ కోహ్లీ ఒత్తిడి చేయడంతో అంపైర్లు నో బాల్ ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. భారత్ మోసం చేసి, ఈ మ్యాచ్ గెలిచిందని తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. చివర్లో దౌర్జన్యంగా పరుగులు లాక్కొని.. పాక్ సాధించాల్సిన విజయాన్ని, భారత్ దోచుకుందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

తాజాగా వీరి జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ కూడా చేరిపోయాడు. ఆ నో బాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంపైర్ భయ్యో.. ఈ రాత్రికి మీకు భోజనం పక్కా’’ అంటూ ఆ నో బాల్‌కి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ షోయబ్ ట్వీట్ చేశాడు. ఇక్కడ షోయబ్ ట్వీట్‌ని గమనిస్తే.. అంప్లైర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారని, ఆ డబ్బులు అందాయి కాబట్టే నో బాల్ కాకున్నా నో బాల్ ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్రికెట్‌లో ఎంతో అనుభవం కలిగిన షోయబ్ లాంటి ఆటగాడు.. ఇలాంటి కామెంట్ చేయడం నిజంగా దారుణం. ఫీల్డ్‌లో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవించాలన్న విషయం షోయబ్‌కి తెలియదా? విమర్శించడం వేరు కానీ, మరీ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారనే భావన వచ్చేలా వ్యాఖ్యానించడం నిజంగా అవమానకరం.

అంతకుముందు మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్ హాగ్ కూడా ఈ నో బాల్‌పై ప్రశ్నలు సంధించాడు. ‘‘అంప్లైర్లు దానిని ‘నో-బాల్’గా ప్రకటించడానికి ముందు ఎందుకు రివ్యూ తీసుకోలేదు? ఫ్రీ హిట్‌ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు?’’ అని ప్రశ్నించాడు. కాగా.. ఏ నో బాల్ గురించైతే ఇంతలా చర్చలు జరుగుతున్నాయో, దాని వల్లే మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అది నో బాల్ ఇవ్వడం వల్లే.. మరో బంతి జత కావడం, ఫ్రీ హిట్ కారణంగా కోహ్లీ ఔటైనా సేఫ్ అవ్వడం జరిగాయి. ఫలితంగా.. మ్యాచ్ భారత్ గెలిచేసింది.

Exit mobile version