Shoaib Akhtar-India: అదృష్టం వల్లే విజయాలు.. వరల్డ్‌ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు!

  • టీమిండియా ప్రదర్శనపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
  • వరల్డ్‌ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు
  • వరల్డ్‌ కప్‌ 2026లో అదృష్టం వల్లే విజయాలు
Shoaib Akhtar India

Shoaib Akhtar India

Shoaib Akhtar about India’s performances in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్ సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సూపర్-8లో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుని గ్రూప్-1 నుంచి రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో భారత్ అదృష్టం వల్లే విజయాలు సాధిస్తోందని, ఓ ఛాంపియన్ జట్టులా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌ల వల్లే మ్యాచ్‌లు గెలుస్తోందని, జట్టుగా ఆధిపత్యం చూపడం లేదని అక్తర్ అంటున్నాడు.

‘గ్రూప్ దశను పరిశీలిస్తే.. భారత్ పూర్తి స్థాయిలో ఏ మ్యాచ్‌నూ ఆధిపత్యం చెలాయించలేదు. అమెరికా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌తో పాటు ప్రత్యర్థి డ్రాప్ క్యాచ్‌లు మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాయి. పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. వెస్టిండీస్ మ్యాచ్‌లో సంజు శాంసన్ వ్యక్తిగత ప్రతిభే భారత్‌కు విజయం అందించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అయితే భారత్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. నా అభిప్రాయం ప్రకారం ఈ వరల్డ్‌ కప్ గెలిచే అర్హత దక్షిణాఫ్రికాకే ఉంది. టోర్నీలో అద్భుత క్రికెట్ ఆడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిజమైన ఛాంపియన్ జట్టులా సఫారీ టీమ్ కనిపిస్తోంది. భారత్ జట్టు ప్రదర్శనలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది’ అని అక్తర్ సూచించాడు.

Also Read: Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 లీగ్ దశలో గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిచింది. న్యూజీలాండ్, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడాపై విజయాలు అందుకుంది. సూపర్-8లో గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్, జింబాంబ్వేపై అద్భుత విజయాలు అందుకుని దర్జాగా సెమీస్ చేరింది. ఇప్పటివరకు సఫారీలు ఓటమినే చూడలేదు. మరోవైపు లీగ్ దశలో గ్రూప్-ఏలో ఉన్న భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాపై విజయాలు అందుకుంది. సూపర్-8లో గ్రూప్-1లో దక్షిణాఫ్రికాపై ఓడిన భారత్.. వెస్టిండీస్, జింబాంబ్వేపై గెలిచి సెమీస్ చేరింది.