Shikhar Dhawan Praises Young Players After Winning 2nd Match: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంపై తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లందరూ బాగా ఆడారని, ఎవ్వరూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదని చెప్పాడు. ‘‘ఇది నిజంగా గొప్ప విజయం. మా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్.. ఇలా ప్రతి ఒక్కరూ మంచి ప్రదర్శన కనబరిచారు. చివర్లో అవేశ్ ఖాన్ (10) సైతం కీలక పరుగులు చేశాడు. ఇదంతా టీ20 లీగ్ వల్లే సాధ్యమైంది. ఆ టోర్నీకి ధన్యవాదాలు’’ అంటూ ధావన్ పేర్కొన్నాడు.
ఇక బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా బాగా వేశామని చెప్పిన ధావన్.. విండీస్ ఓపెనర్లు మాత్రం ఆ జట్టుకి మంచి శుభారంభాన్ని అందించారన్నాడు. ‘‘వాళ్లు 300 పరుగులు సాధిస్తే.. మేం కూడా అన్ని పరుగులు చేయగలమన్న నమ్మకంతో బరిలోకి దిగాం. లక్ష్య చేధనని మేం కాస్త నెమ్మదిగా ప్రారంభించినా.. శుభ్మన్ ధాటిగా రాణించాడు. అనంతరం శ్రేయస్-సంజూ మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. ఆపై మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో.. లక్ష్యాన్ని ఛేదించగలిగాం’’ అని ధావన్ వెల్లడించాడు. ఇదే సమయంలో తన వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన విండీస్ బ్యాట్స్మన్ హోప్‌కి ధన్యవాదాలు తెలిపాడు. తానూ అలాంటి ఘనత సాధించాను కాబట్టి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తనకు తెలుసని ధావన్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్, నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్లు హోప్ (115), కైల్ మేయర్స్ (39)తో పాటు బ్రూక్స్ (35), నికోలస్ పూరన్ (74) పూరన్ రాణించడంతో.. విండీస్ 300 పరుగుల మార్క్‌ని దాటగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడింది. ఆ తర్వాత శుభ్మన్ (43) కుదురుకొని రాణించడంతో భారత్ స్కోర్ ముందుకు కదిలింది. శ్రేయస్ (63), సంజూ (54), హూడా (33)లతో పాటు చివర్లో అక్షర్ (64) చెలరేగడంతో.. భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.