NTV Telugu Site icon

Team India: పంత్‌కు పంచ్.. శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా..?

Team India

Team India

Team India: కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

Read Also: Largest Number of Languages: ఈ చిన్నదేశంలో 840 భాషలు మాట్లాడేస్తున్నారు

అయితే కొంతకాలంగా టీ20లు, టెస్టులకు కాకుండా కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికవుతూ సారథిగా ఆడుతున్న శిఖర్ ధావన్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. దీనికి కారణం ధావన్ ఫామ్ అనే చెప్పాలి. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ధావన్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. అసలే ఓపెనింగ్‌కు రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌గిల్ వంటి ప్రతిభావంతులు పోటీలో ఉండగా ధావన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కూడా అతడు లేనట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అతడి కెరీర్‌కు చరమగీతం పడినట్లే భావించాలని పలువురు భావిస్తున్నారు.

అటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్నాళ్లుగా ఆకట్టుకోని వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పైనా సెలక్టర్లు వేటు వేశారు. టెస్టుల్లో బాగానే ఆడుతున్నా టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లలో రిషబ్ పంత్ పెద్దగా ఆడిందేమీ లేదు. దీంతో అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లకు అవకాశం కల్పించారు. అయితే వీళ్లిద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎవరిని ఆడిస్తారనేది అనుమానంగా ఉంది.

Show comments