Shai Hope Breaks Virat Kohli Record With Latest Century: రెండో వన్డేలో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓటమి చవిచూసిన సంగతి పక్కనపెట్టేస్తే.. సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాట్స్మన్ షై హోప్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, సొగసైన షాట్లతో సునాయాసంగా శతకం బాదాడు. 135 బంతులాడిన ఇతను 8 ఫోర్లు, మూడు సిక్స్‌ల సహాయంతో 115 పరుగులు చేశాడు. తన వందో వన్డే మ్యాచ్‌లో అతడు సెంచరీ చేయడం విశేషం. ఈ క్రమంలోనే హోప్ రెండు రికార్డుల్ని నమోదు చేశాడు. మొదటిది.. వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన పదో ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు.
ఇక రెండో రికార్డ్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకూ అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి స్థానంలో రోహిత్ శర్మ 13 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 11 సెంచరీలతో కోహ్లీ, హోప్ రెండో స్థానాన్ని పంచుకున్నాడు. కానీ.. తాజాగా హోప్ సెంచరీ చేయడంతో ఇతడు రెండో స్థానానికి ఎగబాకగా, కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. వరల్డ్ నంబర్ వన బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ 10 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా.. హోప్ మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు కాబట్టి, టీమిండియాతో జరగనున్న మూడో వన్డేలోనూ సెంచరీ చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగి.. అతడు రోహిత్‌ని సమం చేస్తాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్ని వెస్టిండీస్ జట్టు.. 50 ఓవర్లలో 311/6 స్కోర్ చేసింది. హోప్ (115), కైల్ మేయర్స్ (39)తో పాటు బ్రూక్స్ (35), నికోలస్ పూరన్ (74) బాగా రాణించడంతో.. విండీస్ జట్టు 300 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్.. మొదట్లో కాస్త తడబడింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే.. శుభ్మన్ (43), శ్రేయస్ (63), సంజూ (54), హూడా (33)లతో పాటు చివర్లో అక్షర్ (64) చెలరేగడంతో.. రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది.