Shahid Afridi Comments On Virat Kohli Retirement: రాక రాక చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో రెండు అర్ధశతకాలు, ఒక శతకంతో.. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (274) అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు కోహ్లీ ఇలా ఫామ్‌లోకి తిరిగి రావడంతో, భారత క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వరల్డ్‌కప్‌లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని, ఇదే సరైన సమయమని కుండబద్దలు కొట్టాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆటకు గుడ్‌బై చెప్తేనే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
‘‘పేలవ ఫామ్‌తో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఎవ్వరు గుర్తించరు. అంత గౌరవం లభించదు కూడా! అలా కాకుండా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. దానికి గౌరవం ఉంటుంది. అయితే, కేవలం కొంతమంది మాత్రమే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు. అలాంటి ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ కూడా ఉంటాడని నేను భావిస్తున్నా. అందునా, ఆసియా ఖండం నుంచి ఆడుతున్న ఆటగాళ్లే ఇలాంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. కోహ్లీ తన కెరీర్‌తో ఎంత అద్భుతంగా ఆరంభించాడో, అంతే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు వైదొలుగుతాడని నేను అనుకుంటున్నా. అప్పుడే అతనికి సరైన గౌరవం దక్కుతుంది’’ అని షాహిద్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. అయితే, అతని వ్యాఖ్యల పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆఫ్రిదికి మైండ్ దొబ్బిందా? ఎవరైనా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.