Shafali Verma Incredible Batting: భారత మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ విశ్వరూపం చూపిస్తోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. తన దూకుడు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ.. పరుగుల వరద పారిస్తోంది. ఆసియా కప్ 2026 సెమీ ఫైనల్ నుంచి ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ వరకు షఫాలీ తన జోరును కొనసాగించింది.
షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఆమె ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆసియా కప్ సెమీ ఫైనల్లో 40 బంతుల్లో 64 పరుగులు చేసిన షఫాలీ.. ఫైనల్లో 39 బంతుల్లో 68 పరుగులతో అదరగొట్టింది. ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్‌లోనూ షఫాలీ తన జోరును కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత్ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది.
సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై షఫాలీ వర్మ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది. ఆమె సెంచరీతో టీమిండియా 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు బంగ్లాదేశ్‌ను 81 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. భారత్ 114 పరుగుల భారీ విజయం సాధించింది. ఇక శ్రీలంకతో జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్లోనూ షఫాలీ మరోసారి దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 29 బంతుల్లో 48 రన్స్ చేసింది.
షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 స్కోర్లు 64, 68, 40*, 100*, 48గా ఉన్నాయి. అంటే ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తూ వస్తోంది. ఆసియా కప్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 236 పరుగులతో టోర్నమెంట్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన షఫాలీ.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోనూ అదే జోరును కొనసాగించింది. షఫాలీ బ్యాటింగ్ కారణంగానే భారత మహిళల జట్టు మరో స్వర్ణంను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం షఫాలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు ఇంకా ఎన్నో విజయాలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

