టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా రాణిస్తాడని భావించగా అభిమానులకు నిరాశ తప్పడం లేదు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కోహ్లీ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై వేటు వేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
Read Also: Bhagwant Mann: రేపు పంజాబ్ సీఎం రెండో పెళ్లి
త్వరలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటించనుంది. జూలై 22 నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనకు విశ్రాంతి పేరుతో కోహ్లీపై వేటు వేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లలో కోహ్లీ రాణించకపోతే వేటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. గతంలో తీరిక లేని షెడ్యూల్ కారణంగానే కోహ్లీ విఫలమవుతున్నాడని విమర్శలు రావడంతో సొంతగడ్డపై టీ20 సిరీస్, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ల నుంచి కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో కోహ్లీ ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లి ఆనందంగా గడిపాడు. కానీ విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి మార్పు రాలేదని ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి కాగానే విండీస్ పర్యటనకు టీమిండియాను సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఒకవేళ విండీస్ పర్యటనకు సెలక్టర్లు కోహ్లీని పక్కనపెడితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతడి కెరీర్ ముగిసినట్లేనని భావించక తప్పదు.
