Site icon NTV Telugu

Vijay Hazare Trophy: రుతురాజ్ నాలుగు సెంచరీలు వృథా.. విజయ్ హజారే ట్రోఫీ సౌరాష్ట్ర కైవసం

Vijay Hazare Trophy

Vijay Hazare Trophy

Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో సెంచరీ సాధించాడు. అయినా మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఆ జట్టుపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్‌(131)కు తోడుగా ఏ ఒక్కరూ రాణించలేదు. దాంతో మహారాష్ట్ర సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Read Also: శృంగార తార సిల్క్ స్మిత జీవితంలో ఇంత విషాదమా..?

249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెల్డన్ జాక్సన్‌కు తోడుగా హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జానీ(30 నాటౌట్) రాణించారు. మహరాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌదరి, విక్కీ రెండేసి వికెట్లు తీయగా.. సత్యజీత్ బాచ్‌లావ్ ఓ వికెట్ పడగొట్టాడు. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన షెల్డన్ జాక్సన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లభించింది. కాగా ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ నాలుగు సెంచరీలు చేయడం విశేషం. అతడు మొత్తం 660 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ అటు కెప్టెన్‌గా.. ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. 19 వికెట్లతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Exit mobile version