విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ చెలరేగాడు. జైపుర్ వేదికగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న 28 ఏళ్ల సర్ఫరాజ్.. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 209.33 స్ట్రైక్ రేట్‌తో ఆడిన సర్ఫరాజ్ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో శతకం సాధించాడు. సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ (60) కూడా చెలరేగడంతో ముంబై 444 పరుగులు చేసింది.
ఈ సునామీ ఇన్నింగ్స్ తో సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు ఇదివరకు రోహిత్ పేరిట ఉంది. ఇటీవల సిక్కింపై 62 బంతుల్లోనే రోహిత్ సెంచరీ బాదాడు. చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న సర్ఫరాజ్.. గోవాపై 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి తాను ఉన్నా అంటూ బీసీసీఐ సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు.
Also Read: Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
సర్ఫరాజ్ ఖాన్ రెడ్-బాల్ క్రికెట్ గణాంకాలు అద్భుతం. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 63.15గా ఉంది. 16 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే అతడి కెరీర్ టీ20 క్రికెట్‌తో ప్రారంభమైంది. 2015 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 17 సంవత్సరాల వయసులో ఐపీఎల్ ఆడాడు. అయితే ఆ తర్వాత సర్ఫరాజ్ వైట్-బాల్ క్రికెట్ కెరీర్ క్రమంగా పడిపోయింది. ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫిట్‌నెస్ సాధించాక మూడు ఫార్మాట్లలోనూ నిరూపించుకుంటున్నాడు. ఇటీవల సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున అద్భుతంగా రాణించాడు. టోర్నీలో అతడు 329 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.
