Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!

Sanju Samson Interview

Sanju Samson Interview

Sanju Samson Says I Will Play My Way: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన క్రికెట్ కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు లేదా జట్టులో చోటు కోసం జరిగే నిరంతర పోటీని పట్టించుకోకుండా.. పూర్తిగా తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆటను ఆస్వాదించడమే ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా మూడు అర్ధశతకాలు చేసి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఫామ్ కోల్పోవడంతో.. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ సెలెక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు.

ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు:

జియోస్టార్ నిర్వహించిన ‘బిలీవ్’ కార్యక్రమంలో సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘భారత దేశంలో నిరంతరం పోటీ ఉంటుంది. ఎప్పుడూ ర్యాట్ రేస్ (ఎలుకల పందెం) కొనసాగుతూనే ఉంటుంది. అందులో నేను పరుగెత్తలేను, భాగం కావాలని కూడా అనుకోవడం లేదు. దేవుడి దయతో ఇప్పటికే చాలా సాధించాను. ప్రస్తుతం నాకు 31 ఏళ్లు. ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడగలను. ఇకపై నా నిర్ణయాల ప్రకారమే క్రికెట్ ఆడతాను. ఎలా బ్యాటింగ్ చేయాలో, ఏం చేయాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు’ అని స్పష్టం చేశాడు. టీమిండియాలో ఉన్న పోటీ గురించి సంజు ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచ కప్ గురించి ఆలోచించడం లేదు:

‘2024 ప్రపంచ కప్ అనంతరం 2026 ప్రపంచ కప్ జట్టులో ఉంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఒక దశలో 15 మంది జట్టులో కూడా నా పేరు ఉండదని అర్ధమైంది. అయినా నాకు ఛాన్స్ వచ్చింది. అనుకోకుండా వచ్చిన అవకాశం అది. మూడు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాను. ఇదంతా ఆ దేవుడి దయ. అందుకే 2028 ప్రపంచ కప్ గురించి ఇప్పుడే ఆలోచించడం అవసరం లేదు. జట్టుకు నా అవసరం ఉంటే, నేను బాగా ఆడితే అవకాశాలు సహజంగానే వస్తాయి. లేకపోయినా ఇప్పటికే సాధించిన విజయాలపై నేను గర్వపడతా’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ చాలా స్ట్రిక్ట్‌:

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌పై చూపిన ప్రభావాన్ని కూడా సంజు గుర్తు చేసుకున్నారు. ‘భారత జట్టు శిక్షణ శిబిరంలో, జిమ్‌లో కోహ్లీ, నేను కలిసి వ్యాయామం చేశాం. ఆ సమయంలో కోహ్లీ జీవనశైలి ఎంత ముఖ్యమో నాకు వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు తప్పనిసరి అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన సూచనలు పాటించా. అయితే ఆ తర్వాత ఆ క్రమశిక్షణను అదే స్థాయిలో కొనసాగించలేకపోయా. కోహ్లీ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. జట్టులోని ప్రతి ఒక్కరితోనూ ముక్కుసూటిగా మాట్లాతాడు.ఏ సమస్యకైనా సరైన పరిష్కారం చూపిస్తాడు’ అని సంజు తెలిపాడు.

ఆ ఆలోచన నన్ను ఏకాగ్రతతో ఉంచింది:
‘2026 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జోఫ్రా ఆర్చర్‌ నాపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని అందరూ హెచ్చరించారు. అయితే నేను ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగా. గత ఏడాది సంజు, ఇప్పుడు ఉన్న సంజు వేరు. వెస్టిండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్ నాకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. దేశం కోసం ఆడుతున్నప్పుడు నన్ను ఎవరూ అడ్డుకోలేరనే నమ్మకం బలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓ బాధ్యత నాపై ఉందనే విషయం స్పష్టంగా తెలుసు. జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించా. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండి దేశానికి విజయం అందించాలనే ఆలోచన నన్ను ఏకాగ్రతతో ఉంచింది’ అని సంజు పేర్కొన్నాడు.

అప్పుడు తొందరపడి తప్పిదం చేసేవాడిని:
ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న సందర్భాన్ని కూడా సంజు వివరించారు. ఒక ఓవర్‌లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడినా తనలో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. సరైన బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుని తర్వాత భారీ షాట్లు ఆడగలననే స్పష్టత తనకు ఉందని తెలిపారు. గతంలో అయితే అలాంటి పరిస్థితిలో తొందరపడి తప్పిదం చేసేవాడినని, కానీ వెస్టిండీస్-ఇంగ్లండ్ మ్యాచ్‌ల అనుభవం తన ఆలోచనా విధానాన్ని మార్చిందన్నారు. ప్రపంచకప్ విజయంలో సహచర ఆటగాళ్ల పాత్రను ప్రశంసించారు. ఇషాన్ కిషన్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడని, జస్ప్రీత్ బుమ్రాను ప్యూర్ చీట్ కోడ్ అని అభివర్ణించాడు. ఇంగ్లండ్‌పై సెమీఫైనల్, న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో బుమ్రా అందించిన ఆరంభం జట్టు విజయానికి ఎంతో కీలకమైందని చెప్పాడు. ప్రతి ఆటగాడు తన పాత్రను సమర్థంగా పోషించాడని, ఆ జట్టులో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని సంజు సంతోషం వ్యక్తం చేశాడు.