NTV Telugu Site icon

Team India: సంజు శాంసన్‌కు గాయం.. రెండో టీ20కి దూరం..?

Samju Samson

Samju Samson

Team India:  టీమిండియాను వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ కూడా గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ కూడా గాయపడ్డాడు. దీంతో గురువారం శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ముంబైలోనే ఉన్నాడని.. రెండో మ్యాచ్ జరిగే పూణెకు వెళ్లలేదని సమాచారం అందుతోంది.

Read Also: Gautham Gambhir: ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. ఆటగాళ్లపై పనిభారం తగ్గించాలి

తొలి టీ20 సందర్భంగా సంజు శాంసన్‌ మోకాలి గాయానికి గురయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్‌లో శాంసన్ గాయపడ్డాడు. మ్యాచ్‌ తర్వాత అతడికి స్కాన్‌లు నిర్వహించారు. వీటి ఫలితం కోసం అతడు ముంబైలోనే ఉండిపోయాడు. కాగా రాక రాక అవకాశం వస్తే సంజు శాంసన్ విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో మాజీ క్రికెటర్లు కూడా అతడిపై మండిపడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20లో సంజూ శాంసన్ ఔటైన తీరును సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ మెరుగైన ఆటగాడు అని.. అతనిలో చాలా టాలెంట్ ఉంది కానీ అతడి షాట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్‌గా లేదని.. అదే అతడిని బెంచ్ మీద కూర్చోబెడుతోందని గవాస్కర్ అన్నాడు.