Site icon NTV Telugu

Rohit Sharma: మ్యాచ్ హీరో అతడే.. ఆ లోటుని తీరుస్తున్నాడు

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే! బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో.. ఈ విక్టరీని టీమిండియా తన ఖాతాలో వేసుకోగలిగింది. అయితే.. ఈ గెలుపు క్రెడిట్ మొత్తం అర్ష్‌దీప్ సింగ్‌కే ఇచ్చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌లో హీరో అతడే అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. డెత్ ఓవర్స్‌లో బుమ్రా లేని లోటుని అతడు తీరుస్తున్నాడంటూ ప్రశంసించాడు.

‘‘బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు మేము కాస్త ఒత్తిడికి లోనయ్యాం. బంగ్లాదేశ్‌ చేతిలో 10 వికెట్లు ఉన్న సమయంలో కొంచెం భయమేసింది. అదే సమయంలో వర్షం కూడా రావడంతో, ఇక మా పని అయిపోయిందని అనుకున్నా. కానీ, వర్షం ఆగిన తర్వాత మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ అయితే అదరగొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో హీరో అతడే. ఒత్తిడిలో బౌలింగ్‌ వేయడమన్నది సవాల్‌తో కూడుకున్న పని. అందునా డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయడం.. కత్తి మీద సాము వంటిది. అలాంటి డెత్ ఓవర్స్‌లో అతడు చాలా బాగా వేశాడు. బుమ్రా లేని లోటు తెలియకుండా అర్ష్‌దీప్‌ రాణించడం మాకు ప్రత్యేకం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అనంతరం కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం తమకు కలిసొచ్చిందని.. అతని బ్యాటింగ్‌పై తమ జట్టు ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదని తెలిపాడు.

ఇక కోహ్లీ అయితే.. టీ20 వరల్డ్ ప్రపంచకప్‌ కొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడేమో అనేంతలా దుమ్ముదులిపేస్తున్నాడని రోహిత్ కొనియాడాడు. అతని ఫామ్ ఇలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపాడు. బంగ్లాదేశ్‌ జట్టు బాగా పోరాడిందని, కానీ, అంతిమంగా విజయం ఒకరినే వరిస్తుందని ముగించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వర్షం కారణంగా డీఎల్ఎస్ మెథడ్‌లో 16 ఓవర్లకు టార్గెట్‌ని 151కి కుదించారు. లిటన్ దాస్ మొదట్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. భారత బైలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో, లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది.

Exit mobile version