Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!

Rohit Sharma 2027 World Cup

Rohit Sharma 2027 World Cup

Rohit Sharma’s Big Statement on 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌పై తన మనసులోని మాటను టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ బయటపెట్టాడు. 2023 ప్రపంచ కప్‌లో భారత్ టైటిల్ గెలవలేకపోయిన బాధ తనలో ఇంకా ఉందని చెప్పాడు. వన్డే ప్రపంచ కప్‌ను గెలవాలన్నదే తన లక్ష్యమని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2027 ప్రపంచ కప్ తనకు చివరి అవకాశం అని, ఆ తర్వాత ఆడలేను అని పేర్కొన్నాడు. 2027 ప్రపంచ కప్‌లో తాను ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

నా ఆలోచనల్లో ఉంది:

విమల్ కుమార్‌తో జరిగిన సంభాషణలో రోహిత్ శర్మకు 2027 ప్రపంచ కప్‌పై ప్రశ్న ఎదురైంది. 2023లో చేజారిన ప్రపంచ కప్‌ను వచ్చే టోర్నీలో గెలుచుకోవాలనే ఆలోచన ఉందా?.. 2027 వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నారా?.. రిటైర్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అని అడగగా.. హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చాడు. ‘కచ్చితంగా 2027 ప్రపంచ కప్‌ నా ఆలోచనల్లో ఉంది. 2023లో మనం సాధించలేకపోయిన దాన్ని నెరవేర్చాలని ఉంది. కప్ గెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ప్రపంచ కప్ గెలవాలన్నది నా కోరిక. ఇది ఇప్పటిది కాదు.. చిన్నప్పుడే అనుకున్నా. అందుకు నా ఫిట్‌నెస్‌పై కూడా ఎంతో శ్రమించాను. నేను టీ20 ప్రపంచ కప్ గెలిచాను. కానీ వన్డే ప్రపంచ కప్ పూర్తిగా బిన్నం’ అని రోహిత్ చెప్పాడు.

నాకు చివరి అవకాశం:

వన్డే ప్రపంచ కప్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ’50 ఓవర్ల ప్రపంచ కప్ అత్యంత కఠినమైన టోర్నీల్లో ఒకటి. దానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందుకే 2027 ప్రపంచ కప్ ఖచ్చితంగా నా ఆలోచనల్లో ఉంది. ఇది నాకు చివరి అవకాశం. ఆ తర్వాత ఇంకో ప్రపంచ కప్‌ ఆడలేను. ఆ అవకాశం కూడా నాకు ఉండదు. అందుకే 2027 ప్రపంచ కప్‌ గెలవడానికి నా వంతు కృషి చేస్తా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 2023 ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరినప్పటికీ.. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌ను కోల్పోయింది. ఆ టోర్నీలో రోహిత్ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత ఆరంభాలు ఇచ్చాడు. అయితే చివరికి ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోలేకపోవడం హిట్‌మ్యాన్ కెరీర్‌లో అసంపూర్తిగా మిగిలింది.

ఫిట్‌నెస్, ఫామ్ కీలకం:

ఇప్పటికే రోహిత్ టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా కష్టపడుతున్నానని స్వయంగా చెప్పి.. 2027 ప్రపంచ కప్ వరకు ఆడతానని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ నాటికి రోహిత్‌కు 39 ఏళ్లు వస్తాయి. వయసు, ఫిట్‌నెస్, ఫామ్ వంటి అంశాలు అతడి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. అయినప్పటికీ ప్రపంచకప్ గెలవాలన్న తన లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నానని రోహిత్ స్పష్టం చేశాడు. మరి హిట్‌మ్యాన్ కల నెరవేరుతుందా? లేదా అనేది 2027లో తేలనుంది.