Site icon NTV Telugu

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. ధోనీ, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు..!!

Rohit Sharma1

Rohit Sharma1

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 2015 నుంచి ఇప్పటివరకు భారత్‌లో దక్షిణాఫ్రికా నాలుగు సార్లు టీ20 సిరీస్ ఆడింది. తొలి సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. రెండు, మూడు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. తొలి సిరీస్‌కు ధోనీ, రెండో సిరీస్‌కు కోహ్లీ, మూడో సిరీస్‌కు పంత్ నాయకత్వం వహించారు. ఇప్పుడు నాలుగో సిరీస్‌లో మాత్రం టీమిండియా దుమ్మురేపింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాలకు సాధ్యం కాని సిరీస్ విజయాన్ని రోహిత్ శర్మ సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Read Also: Suryakumar Yadav: మ్యాక్స్‌వెల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్

2015లో డుప్లెసిస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా భారత్‌లో టీ20 సిరీస్ ఆడింది. అప్పుడు ధోనీ నాయకత్వలోని జట్టు తొలి టీ20, రెండో టీ20లలో ఓడిపోయింది. మూడో టీ20 మాత్రం వర్షం కారణంగా రద్దయ్యింది. అనంతరం 2019లో డికాక్ కెప్టెన్సీలో మరోసారి దక్షిణాఫ్రికా భారత గడ్డపై టీ20 సిరీస్ ఆడగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో టీ20లో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. మూడో టీ20లో కెప్టెన్ డికాక్ హాఫ్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ ఏడాది జూన్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై ఐదు టీ20ల సిరీస్ ఆడింది. రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్ 2-2గా సమంగా ముగిసింది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి పటిష్ట జట్లపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అటు 2021 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆరు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో విజయం సాధించడం విశేషం.

Exit mobile version