Site icon NTV Telugu

IPL 2022: లక్నో ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ

Rcb

Rcb

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గత రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మిని ఫైనల్‌ మ్యాచ్‌ను తలపించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును లక్నో ముందు ఉంచింది. గత మ్యాచ్‌లో మెరిసిన కోహ్లీ 25 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. అయితే, క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ చెలరేగాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేశాడు. 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో పటీదార్ కీలక పాత్ర పోషించాడు.

దీంతో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది. శుక్రవారం రాజస్తాన్‌తో క్వాలిఫయర్‌-2లో బెంగళూరు తలడపడనుంది. ఇక ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కథ ఎలిమినేటర్‌లో వెనుదిరిగింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆఖరి వరకు పోరాడినప్పటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 79 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

Exit mobile version