RCB Scored 121 Runs In First 10 Overs Against CSK: మొదట్లో ఆరు పరుగుల వద్దే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన లామ్రోర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇంకేముంది.. ఆర్సీబీకి అంత భారీ స్కోరు ఛేధించడం కష్టమేనని అంతా అనుకున్నారు. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయొచ్చని భావించారు. కానీ.. పరిణామాలు అందుకు భిన్నంగా చోటు చేసుకున్నాయి. ఉన్న డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కలలో కూడా ఊహించని ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపారు. చెన్నై బౌలర్లపై బౌండరీల దండయాత్ర చేశారు.

బంతులను ఏమాత్రం వృధా చేయకుండా.. ఓవైపు సింగిల్స్, డబుల్స్ తీస్తూనే.. మరోవైపు బౌండరీల వర్షం కురిపించారు. ఫలితంగా.. 10 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 121 పరుగులు నమోదు చేయగలిగింది. ఈ క్రమంలోనే డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. ఇంకా వీళ్లు లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జోరు కొనసాగిస్తే.. ఆర్సీబీ విజయం తథ్యమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. బహుశా కొన్ని బంతులు మిగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్‌లో ఆ ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కలిసి ఊచకోత కోస్తున్నారు. ఇలాంటి సమయంలో వికెట్లు కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టడం శ్రేయస్కరం. చూద్దాం.. ఆర్సీబీ ఎలా లాక్కొస్తుందో?