Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్‌షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఎంతో విలువైన ఆటగాడిని టీమిండియా కోల్పోతుందని అనుమానం వ్యక్తం చేసింది.
అయితే ఒకవేళ టీ20 ప్రపంచకప్‌కు జడేజా దూరమైతే అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ లేదా పేస్ ఆల్‌రౌండర్ దీపక్ హుడాలకు చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసియాకప్‌లో జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్‌తో టీమ్ మేనేజ్‌మెంట్ భర్తీ చేసింది. పాకిస్థాన్‌తో ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా జరిగే మ్యాచ్‌లో అక్షర్ పటేల్ రాణిస్తే టీ20 ప్రపంచకప్‌కు అతడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. లేదంటే ఆస్ట్రేలియాలో పిచ్‌లు పేసర్లకు స్వర్గధామంగా ఉంటాయి కాబట్టి దీపక్ హుడాను ఆడించే అవకాశాలు మెరుగుపడతాయి.
Read Also: Ryan Burl: చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకున్నాడు.. ఆస్ట్రేలియాపై చెలరేగాడు..!!
మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియాలో పలు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్, జడేజా స్థానంలో అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ స్థానంలో అశ్విన్ లేదా రవి బిష్ణోయ్‌కు తుది జట్టులో స్థానం లభించనుంది. కాగా తొలి మ్యాచ్ తరహాలోనే పాక్‌ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుండగా గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది.