టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జడేజా, తాజాగా కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దాంతో, ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు జడేజా అందుబాటులో ఉండడని ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం జడ్డూ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. ఇక, జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి ఎంపిక చేసినట్టు వివరించారు. ఆసియా కప్ టోర్నీలో టీమిండియా స్టాండ్ బై ఆటగాళ్లలో అక్షర్ పటేల్ కూడా ఒకడు. జడేజా తరహాలోనే అక్షర్ పటేల్ కూడా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించగలడు.
Read Also: BJP: ఏపీలో బీజేపీ భారీ స్కెచ్.. ఏకంగా 5 వేల సభలు..!