ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు రూట్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ నాలుగో స్థానంలో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో రోహిత్ శర్మ ఏడో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ 9వ స్థానంలో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ పదో స్థానంలో ఉన్నారు.
మరోవైపు వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ, డికాక్, రోహిత్ శర్మ, అరోన్ ఫించ్ టాప్-5లో కొనసాగుతున్నారు. బౌలర్ల విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, హేజిల్ వుడ్, క్రిస్ వోక్స్, హెన్రీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ టాప్-5లో ఉన్నారు. భారత్ నుంచి బుమ్రా ఒక్కడే టాప్-10లో ఆరో స్థానంలో నిలిచాడు. వన్డే ఆల్‌రౌండర్ల కేటగిరీలో షకీబుల్ హసన్, మహ్మద్ నబీ, క్రిస్ వోక్స్, రషీద్ ఖాన్, మిచెల్ శాంట్నర్ టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో భారత్ నుంచి ఒక్కరికి కూడా స్థానం లభించలేదు.
