Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!

Jadeja Ind Vs Nz 1st Test

Jadeja Ind Vs Nz 1st Test

IND vs NZ 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌తో పాటు వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. న్యూజిలాండ్ తుది జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటమే సుందర్ ఎంపికకు ప్రధాన కారణమని కోటక్ తెలిపారు. టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతో.. వారిని ఎదుర్కొనేందుకు సుందర్ ఆఫ్ స్పిన్ ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్లు చెప్పారు.

తొలి టెస్టులో భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడంపై కూడా సితాన్షు కోటక్ వివరణ ఇచ్చారు. ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుని విభిన్న నైపుణ్యాలు కలిగిన బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బంతిని స్వింగ్ చేయగలరని.. ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ సీమ్ మూవ్‌మెంట్‌తో పాటు అదనపు వేగాన్ని అందించగలరని వివరించారు. ‘ఇద్దరు బౌలర్లు బంతిని బాగా స్వింగ్ చేయగలరు. మరో ఇద్దరు సీమ్ మూవ్‌మెంట్‌తో పాటు వేగాన్ని కూడా రాబట్టగలరు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుంటాం’ అని కోటక్ పేర్కొన్నారు. అంటే ఒక్కరోజు పరిస్థితులనే కాకుండా, మ్యాచ్ మొత్తం అవసరాలను పరిగణనలోకి తీసుకుని బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసినట్లు చెప్పాడు.

మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక గురించి కూడా కోటక్ స్పందించారు. ప్రసిద్ధ్ వికెట్లు తీయాలనే లక్ష్యంతో దూకుడుగా బౌలింగ్ చేసే ఆటగాడని చెప్పారు. అయితే అతడి దూకుడు కారణంగా కొన్నిసార్లు ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందని వివరించారు. వికెట్లు తీసినప్పుడు ప్రశంసించే అభిమానులు, పరుగులు ఇచ్చినప్పుడు విమర్శిస్తారని వ్యాఖ్యానించారు. తొలి రోజు వికెట్లు తీయలేకపోయినంత మాత్రాన అతడి ప్రదర్శనపై తొందరపడి నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇక వెల్లింగ్టన్‌లో తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. చివరి సెషన్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు పుంజుకున్నారు. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కివీస్‌ 70 పరుగులకే ఐదు వికెట్లు కొల్పోయింది. బుమ్రా మూడు కీలక వికెట్లు పడగొట్టగా, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు. అయితే ఆ తర్వాత నికోల్స్, ఫిలిప్స్ భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపారు.