స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు.
అయితే ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న జడేజా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదని తెలుస్తోంది. కేవలం తేలికపాటి వార్మప్‌లు చేసిన జడేజా అసౌకర్యంగా కనిపించాడు. జడేజా ఫిట్‌నెస్‌పై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా జడేజాను కాపాడుకునేందుకు మేనేజ్‌మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగే పింక్ బాల్ సమరంలో జడేజా దూరమైతే అతడి స్థానంలో ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
