Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ రావడంపైనా తాజాగా రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రోజర్ బిన్నీతో తాను 1983 ప్రపంచకప్ ఆడానని రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు. అతడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రావడం సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచకప్‌లోని విన్నింగ్ సభ్యుడు అత్యున్నత పదవిలోకి రానుండటం గొప్ప విషయంగా రవిశాస్త్రి అభివర్ణించాడు.
Read Also: World Egg day: పవర్ ప్యాక్డ్ ఫుడ్.. గుడ్డుతో ఎన్నో ప్రయోజనాలు
కర్ణాటక స్టేట్ అసోసియేషన్ నుంచి రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తున్నాడని.. తనకు తెలిసి బీసీసీఐ అధ్యక్ష పదవిలో ప్రపంచకప్ విజేత కూర్చోవడం ఇదే తొలిసారి అంటూ రవిశాస్త్రి పరోక్షంగా గంగూలీకి చురకలు అంటించాడు. బిన్నీ రాకతో దేశవాళీ క్రికెట్‌లో వసతులు మెరుగుపడతాయని తాను ఆకాంక్షిస్తున్నట్లు రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు బీసీసీఐకి వరుసగా రెండోసారి ఎవరూ అధ్యక్షుడు రాలేదని.. ఒకరు రావాలంటే మరొకరు తప్పుకోవాల్సిందేనని రవిశాస్త్రి అన్నాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నాడు. అన్నీ పనులు చేయాలని ఉన్నా కొన్ని పనులు మాత్రమే చేయగలరని.. దేశవాళీ క్రికెట్‌లో వసతులపై కొత్త పాలకవర్గం దృష్టి సారించాలని రవిశాస్త్రి సూచించాడు. అయితే పరోక్షంగా గంగూలీపై రవిశాస్త్రి విమర్శలు చేయడాన్ని దాదా అభిమానులు తప్పుపడుతున్నారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకుని అదేపనిగా విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
