బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కు ఒక వైపే చూడొద్దని.. రెండు వైపులా చూడాలని హితవు పలికాడు. సమస్యను చూస్తుంటే ముందుకు వెళ్లలేమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అలా చూస్తే అద్భుత విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో తాను ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేశానని.. ఈ ప్రయాణంలో తాము భారత్‌కు గొప్ప విజయాలు అందించామని గుర్తుచేశాడు.
కాగా ప్రస్తుతం టీమిండియాలో పోటీ తీవ్రంగా ఉండటం వల్ల భారతజట్టులో చోటు దక్కడం కష్టంగా ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వచ్చిన అవకాశాలను యంగ్ ప్లేయర్స్ అందిపుచ్చుకోవాలని సూచించాడు. నిలకడగా రాణిస్తే మూడు ఫార్మాట్లలో జట్టులో స్థానం సంపాదించడం కష్టమేమీ కాదన్నాడు. ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజమేనని.. 100వ టెస్టులో కోహ్లీ సెంచరీ చేస్తే ఈ టెస్టును మరింత చిరస్మరణీయం చేసుకోవచ్చని రవిశాస్త్రి అన్నాడు. అటు హైదరాబాదీ ఆటగాడు హనుమా విహారి చాలా టాలెంట్ ఉన్న ఆటగాడు అని.. మరో 12 ఏళ్లు ఆడే సత్తా అతనిలో ఉందన్నాడు.
