Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించినా.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు.
కాగా ఆసియాకప్‌లో అంతంత మాత్రంగానే పాండ్యా రాణించడంతో విమర్శకులు పెదవి విరిచారు. ఇలా ఆడితే టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసియా కప్‌కు ముందు పాండ్యా గాయపడి జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో విశేషంగా రాణించడంతో పాండ్యాను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ సిరీస్‌లలో అద్భుతంగా ఆడాడు. కానీ ఆసియా కప్‌లో జడేజా గైర్హాజరీ, పాండ్యా మోస్తరు ప్రదర్శన టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో విమర్శకులు దుమ్మెత్తి పోయడంతో తాజాగా రవిశాస్త్రి పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు. కాగా భవిష్యత్‌లో తాను మరోసారి కోచ్ అవతారం ఎత్తే ప్రసక్తే లేదని రవిశాస్త్రి అన్నాడు. కోచ్‌గా తన కాలం ముగిసిపోయిందని.. భారత క్రికెట్‌కు ఎంత చేయాలో అంతా చేశానని తెలిపాడు. ఇకపై కోచింగ్ ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.
