NTV Telugu Site icon

Cricket: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం

Ranji Trophy Min

Ranji Trophy Min

దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. మధ్యప్రదేశ్ ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించింది.

వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ వంటి ప్రతిభావంతులు లేకపోయినా మధ్యప్రదేశ్ జట్టు బలమైన ముంబై జట్టును ఓడించడంపై క్రికెట్ పండితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టును అభినందిస్తున్నారు. గతంలో ముంబై జట్టు 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా మధ్యప్రదేశ్ సాధించిన ఈ విజయం వెనుక కోచ్ చంద్రకాంత్ పండిట్ కృషి ఎంతో ఉంది. సాదాసీదా ఆటగాళ్లుగా ఉన్న రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యశ్ దూబే, హిమాంశు మంత్రి వంటివాళ్లని స్టార్లుగా తీర్చిదిద్దాడు. కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు ఇది దేశవాళీ క్రికెట్‌లో ఆరో టైటిల్ కావడం విశేషం.