Why Rajat Patidar Missed India T20 Squad: భారత క్రికెట్‌లో పోటీ స్థాయి ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో అతడి పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో ఆర్సీబీకి వరుస టైటిల్స్ అందించిన నాయకుడిగా రజత్ పాటిదార్ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా 2026 సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ 501 పరుగులు చేశాడు. 192.69 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన పాటిదార్.. 30 ఫోర్లు, 42 సిక్సర్లతో తన దూకుడు చూపించాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పాటిదార్ భారత జట్టుకు ఎంపిక కాకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో అనేక మంది ఆటగాళ్ల పేర్లను పరిశీలించామని, అయితే జట్టులో కేవలం పరిమిత స్థానాలు మాత్రమే ఉండటంతో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాలేదని చెప్పారు.
‘బీసీసీఐ సమావేశంలో మేము చాలా మంది ఆటగాళ్ల గురించి చర్చించాం. భారతదేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొరత లేదు. జట్టులోకి వచ్చే అర్హత ఉన్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ మేము 15 మంది ఆటగాళ్లకే అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన ఆటగాళ్లు తమ అవకాశాలను బాగా వినియోగించుకుంటున్నారు. మేము మంచి జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం. కొంతమంది అర్హులైన ఆటగాళ్లు ఎంపిక కాలేదు. ఇది మేము ఒప్పుకోవాల్సిందే. భవిష్యత్తులో అందరికి అవకాశాలు వస్తాయి. పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి.. నిత్యం రన్స్ చేస్తూనే ఉండాలి’ అని అజిత్ అగార్కర్ వివరించారు.
ఐపీఎల్ 2026లో రజత్ పాటిదార్ ప్రదర్శన గణాంకాలు చూస్తే అతడి ఎంపికపై ఎందుకు చర్చ జరుగుతోందో అర్థమవుతుంది. ముఖ్యంగా 12వ ఓవర్ నుంచి 16వ ఓవర్ మధ్య అతడు 108 బంతుల్లో 234 పరుగులు చేసి.. 216.67 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో 278.57 స్ట్రైక్‌రేట్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పే బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. అయితే సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి ఆటగాళ్లపై విశ్వాసం ఉంచారు. నంబర్-4, నంబర్-5 స్థానాల్లో వారినే కొనసాగించాలని నిర్ణయించడంతో పాటిదార్‌కు అవకాశం దక్కలేదు. ఇదే అతడి ఎంపికకు ప్రధాన అడ్డంకిగా మారింది.
రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించిన కెప్టెన్‌గా, అద్భుత ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌గా రజత్ పాటిదార్‌కు భవిష్యత్తులో భారత జట్టులో అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ప్రస్తుతం అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో తన ప్రదర్శనను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక కొత్త టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు.

