Rahul Dravid Tests Negative For Covid: కొన్ని రోజుల క్రితం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో.. ఆసియా కప్‌కి అందుబాటులో ఉంటాడా? లేడా? అన్నది ఆందోళనకరంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కరోనా నుంచి ద్రవిడ్ పూర్తిగా కోలుకున్నాడు. శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కి, ఆదివారం ఉదయం భారత జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న కరోనా బారిన పడిన ఆయన.. బోర్డు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో.. దుబాయ్‌కి చేరుకొని, భారత జట్టుతో కలిసిపోయాడు.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌కి ముందే ద్రవిడ్ ఇలా టీమిండియాతో చేరడంపై క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మ్యాచ్ గెలవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడంతో పాటు వాటిపై చర్చలు జరపడానికి హెడ్ కోచ్ చాలా అవసరం. ప్రత్యర్థి జట్టుకి ఊహకందని రీతిలో వ్యూహాలు రచించడంలో ద్రవిడ్ దిట్ట. అందుకే, అత్యంత కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆయన ఉంటే బాగుండేదని అంతా అనుకున్నారు. అందరూ కోరుకున్నట్టుగానే కరోనా నుంచి కోలుకొని, ఆయన సరిగ్గా మ్యాచ్‌కి ముందు రంగంలోకి దిగాడు. ఈయన ఐసోలేషన్‌లో ఉన్నంతవరకూ.. తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. ద్రవిడ్ తిరిగి రావడాన్ని శుభసూచకంగా భావిస్తున్నారు.
కాగా.. రాత్రి 7 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాధారణంగానే భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. అయితే, ఈ మ్యాచ్‌కి మరింత క్రేజ్ వచ్చిపడింది. ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తారని అందరూ ఆశిస్తున్నారు. పైగా.. ఇరు జట్ల మధ్య చాలాకాలం తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో, ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.