Site icon NTV Telugu

Common Wealth Games 2022: భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన పీవీ సింధు

Pv Sindhu In Common Wealth Games

Pv Sindhu In Common Wealth Games

Common Wealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది. కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో పీవీ సింధు తన కెరీర్‌లో మొట్టమొదటి కామన్‌వెల్త్ మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని అందుకుంది. ప్రత్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ.. సింధు మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. మిచెల్‌ లీపై 21-15, 21-13 తేడాతో వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి ఫైనల్‌లో బంగారు పతకాన్ని పీవీ సింధు కైవసం చేసుకుంది.

పీవీ సింధుకు మ్యాచ్‌ ప్రారంభంలోనే శుభారంభం లభించింది. తొలి గేమ్‌లో 11-8తో ఆధిక్యంలో నిలిచింది. మిచెల్ లీ తన భారత ప్రత్యర్థికి గొప్ప పోటీని అందించింది. కానీ పీవీ సింధు చెలరేగిపోవడంతో వెనుకపడిపోయింది. ఫలితంగా తొలి గేమ్‌లో సింధు 21-15తో విజయం సాధించింది. మిచెల్‌లీ రెండో గేమ్‌ను చక్కగా ప్రారంభించినా.. కొద్దిసేపటికే సింధు మరోసారి సద్వినియోగం చేసుకుంది. కెనడియన్ తప్పులు చేస్తూనే ఉంది. ప్రతి వైఫల్యంతో సింధు ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. రెండో గేమ్ ముగిసే సమయానికి సింధు 11-6తో ఆధిక్యంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి మొదటి కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని అందించడానికిఆమెకు మరో పది పాయింట్లు అవసరం. అనంతరం సింధుకు గట్టి పోటీ ఇవ్వడంతో రెండో గేమ్‌లో ఉత్కంఠ నెలకొంది. చివరికి సింధు ఆధిక్యం 13-11కి తగ్గింది. అనంతరం పుంజుకున్న సింధు రెండో గేమ్‌లో పోరాడి చివరికి 21-13తో విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్ 2022లో తన మొట్టమొదటి మహిళల సింగిల్స్ పతకాన్ని, బ్యాడ్మింటన్‌లో భారత్‌ మొట్టమొదటి స్వర్ణాన్ని కూడా సాధించినట్లు అయింది.

Commonwealth Games 2022: నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌ షెడ్యూల్‌ ఇదే..

ఈ పతకంతో భారత ఖాతాలో 56 పతకాలు (19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే అందరి దృష్టి పివి సింధుపైనే ఉంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా స్వర్ణ పతకంపై కన్నేశాడు. పురుషుల డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఫైనల్ ఆడనున్నారు. సాయంత్రం తర్వాత పురుషుల హాకీ జట్టు బంగారు పతక పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టేబుల్ టెన్నిస్‌లో, ఆచంట శరత్ కమల్ కూడా పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఆడనున్నాడు.

Exit mobile version