Neeraj Chopra: డైమండ్ లీగ్‌లోనూ సత్తా చాటిన నీరజ్.. రజతం కైవసం

Neeraj Chopra

Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజత పతకం కైవసం చేసుకున్నాడు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90 మీటర్లు త్రో చేయడంతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలిచాడు.

Read Also: Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష

డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ చోప్రాకు ఇదే తొలి పతకం. 24 ఏళ్ల నీరజ్‌ ఇటీవల జరిగిన పావో నుర్మి క్రీడల్లో 89.30 మీ త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు డైమండ్‌ లీగ్‌లో అతడు తన తొలి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల త్రో చేశాడు. ఆ తర్వాత వరుసగా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67మీ, 86.84మీ త్రోలు చేశాడు. స్వర్ణ విజేత పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా) తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల త్రో చేసే వరకు నీరజ్‌ చోప్రాదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా డైమండ్ లీగ్‌లో జర్మనీ ఆటగాడు వెబ్బర్‌ 89.08 మీటర్లు జావెలిన్‌ను త్రో చేసి కాంస్య పతకం గెలుచుకున్నాడు.