Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్‌లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.
Read Also: Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?
స్వాతంత్ర దినోత్సవం రోజు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలను నిర్వాహకులు చేపట్టగా ఆరు నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సుమారు 75 వేల మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు సైట్‌లో క్యూ సిస్టంను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏడున్నర లక్షల మంది టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే టిక్కెట్లు తక్కువ ఉండటంతో రాత్రి పూట అమ్మకాలను చేపట్టారు. రాత్రి పూట కూడా డిమాండ్ తగ్గకపోవడంతో నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో టిక్కెట్లు లభించక చాలా మంది నిరాశకు గురయ్యారు. కాగా ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనలు పాటించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగాయని ఆరోపిస్తున్నారు. తెలిసినవారికి టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.