మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ అధికారికంగా తప్పుకున్నాడు. ఈ మేరకు తన సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ధోనీ 204 మ్యాచుల్లో చెన్నైకు సారథ్యం వహించగా ఆ జట్టు 121 విజయాలు సాధించింది. నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 9 సార్లు ఫైనల్ చేరింది.
ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ధోనీ తన సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకోవడానికి ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడం మా జట్టుకు తీరని లోటు’ అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది.
కాగా ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు 2008లో ఫైనలిస్ట్, 2009లో సెమీఫైనలిస్ట్, 2010లో ఛాంపియన్స్, 2011లో ఛాంపియన్స్, 2012లో ఫైనలిస్ట్, 2013లో ఫైనలిస్ట్, 2014లో ప్లేఆఫ్స్, 2015లో ఫైనలిస్ట్, 2018లో ఛాంపియన్స్, 2019లో ఫైనలిస్ట్, 2021లో ఛాంపియన్స్‌గా నిలిచింది.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022