పసికూన జట్టు అనే స్థాయి నుండి అగ్ర జట్లను సైతం ముచ్చెమటలు పట్టించే స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్ జట్టు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్లో ఉన్నట్టుండి ఇప్పుడు ప్రకంపనలు చెలరేగాయి. ఉన్నట్టుండి ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ రాజీనామా ప్రకటించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోమినుల్ హక్ ఈ సంవత్సరంలో పేలవమైన ఫామ్ కనబర్చుతున్నాడు. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి అతను మంగళవారం టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.
బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఇంట్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌లతో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని మోమినుల్ వెల్లడించాడు. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి తర్వాత అతని బ్యాటింగ్ పట్ల తీవ్ర విమర్శలొచ్చాయి.
“నేను కెప్టెన్‌గా జట్టుకు సహకారం అందించలేకపోతున్నాను. జట్టును ప్రోత్సహించడంలో కూడా విఫలమవుతున్నాను. కాబట్టి నా స్థానంలో వేరొకరికి బాధ్యత అప్పగిస్తే మంచిదని నేను భావిస్తున్నాను’ అని మోమినుల్ విలేకరుల సమావేశంలో తెలిపాడు.
ఇకపోతే 2019లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన మోమినుల్ 53 టెస్టుల్లో 11సెంచరీలతో 3,525పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మోమినుల్ హక్ మాత్రమే. ఇక వెస్టిండీస్ పర్యటన కోసం షకీబ్ అల్ హసన్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి నియమిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమో అని ఎదురుచూడాల్సివుంది.