వ్యక్తిగతంగా తాను మంచి ఫామ్‌లో ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుందని.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకమని సిరాజ్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సందర్భంగా భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ చేసింది.
‘డబ్ల్యూటీసీ 2025-27లో దక్షిణాఫ్రికాతో ఆడనున్న రెండు టెస్టులు టీమిండియాకు కీలకం. డిఫెండింగ్ ఛాంపియన్ ప్రొటీస్ ఇటీవల పాకిస్థాన్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. టెస్ట్ సిరీస్‌పై మేం మంచి విశ్వాసంతో ఉన్నాం. భారత జట్టు ఫామ్‌లో ఉంది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించాం. స్వదేశంలో వెస్టిండీస్‌పై సత్తాచాటాము. దక్షిణాఫ్రికాపై కూడా విజయం సాధిస్తామని భావిస్తున్నా. ఇక వ్యక్తిగతంగా మంచి ఫామ్‌లో ఉన్నా. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మహ్మద్ సిరాజ్ చెప్పాడు.
Also Read: Peddi : మొత్తానికి ఆ లోటు తీర్చేసిన రామ్ చరణ్
మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీంఇండియాలో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా తర్వాత సిరాజ్‌పైనే భారత్ ఆధారపడుతోంది. బుమ్రా లేని సమయాల్లో బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున 43 టెస్టుల్లో 133 వికెట్స్ పడగొట్టాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 6/15. ఇటీవలి విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ పది వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో 23 వికెట్లు పడగొట్టాడు.
