Site icon NTV Telugu

Team India: బుమ్రా స్థానంలో షమీ.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Shami

Shami

Team India: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బుమ్రా స్థానంలో ఎవరినీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే తాజాగా బుమ్రా స్థానంలో షమీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతంలో స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో షమీ ఉండగా ప్రస్తుతం తుది జట్టులోకి అతడిని తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారము షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడని.. త్వరలో బ్రిస్బేన్‌లో ఉన్న టీమిండియాతో అతడు కలుస్తాడని బీసీసీఐ వివరించింది.

Read Also: T20 World Cup 2022: స్టేడియం సామర్థ్యానికి మంచి అమ్ముడైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు

మరోవైపు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లను స్టాండ్ బై ఆటగాళ్లుగా తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వీరిద్దరూ త్వరలో ఆస్ట్రేలియా చేరుకుంటారని తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతోంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడగా.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్ రాణిస్తుండటంతో అతడు ప్రధాన టోర్నీలో తుది జట్టులో ఉండే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే రిషబ్ పంత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలోనూ తేలిపోయాడు. ఓపెనర్‌గా అతడిని టీమిండియా ప్రయోగించగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే బరిలోకి దిగనున్నారు. ఎవరైనా గాయపడితే మాత్రం రిషబ్ పంత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

మార్పులు చేసిన అనంతరం టీ20 ప్రపంచకప్‌కు 15 సభ్యుల టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.

Exit mobile version