Site icon NTV Telugu

ICC Rankings: నంబర్‌వన్‌గా పాకిస్థాన్ వికెట్ కీపర్.. నాలుగో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్

Rizwan

Rizwan

ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ ఆటగాడిగా అవతరించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్థానాన్ని రిజ్వాన్ ఆక్రమించాడు. దీంతో బాబర్ ఆజమ్ రెండో స్థానానికి పడిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 815 రేటింగ్ పాయింట్లు ఉండగా బాబర్ ఆజమ్ ఖాతాలో 794 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ 96 సగటుతో 192 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?

గ్రూప్ దశలో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన రిజ్వాన్.. సూపర్-4లో టీమిండియాపై 71 పరుగులు చేసి పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మహ్మద్ నవాజ్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడికి దక్కింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (775 పాయింట్లు) రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ (792) ఉన్నాడు. రోహిత్ శర్మ 14వ ర్యాంకులో, విరాట్ కోహ్లీ 29వ ర్యాంకులో కొనసాగుతున్నారు. అటు టీమిండియాతో మ్యాచ్‌లో రాణించిన శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు.

Exit mobile version