Site icon NTV Telugu

IND Vs SL: రెండో రోజు ముగిసిన ఆట.. కష్టాల్లో శ్రీలంక

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ప్రస్తుతం నిస్సాంక, అసలంక క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఉదయం సెషన్‌లో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తే శ్రీలంకకు ఈ టెస్టులో ఓటమి తప్పకపోవచ్చు.

అటు రెండో రోజు ఉదయం సెషన్‌లో భారత బ్యాటింగ్ జోరుగా సాగింది. రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఏడో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజాకు లోయర్ ఆర్డర్ నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో అతడు 228 బంతుల్లో 3 సిక్సులు, 17 ఫోర్లతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో హనుమ విహారి 58, విరాట్ కోహ్లీ 45, రిషబ్ పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version