Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికా
  • దక్షిణాఫ్రికా బిగ్ మిస్టేక్ వల్లే టీమిండియాకు వరల్డ్‌ కప్‌
  • మంచి అవకాశాన్ని దక్షిణాఫ్రికా మిస్ చేసుకుంది
Michael Vaughan

Michael Vaughan

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2026 గురించి మాజీ ఇంగ్లండ్ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా టోర్నీలో అత్యంత ‘తెలివి తక్కువ జట్టు’ దక్షిణాఫ్రికానే అని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా చేసిన బిగ్ మిస్టేక్ వల్లే భారత్ చివరకు వరల్డ్‌ కప్‌ను గెలుచుకుందన్నారు. సూపర్‌ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఓడిపోయి ఉంటే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదన్నారు. పటిష్ట జట్టు భారత్‌ను వరల్డ్‌ కప్‌ నుంచి ముందే బయటకు పంపించి ఉండాల్సిందని, మంచి అవకాశాన్ని దక్షిణాఫ్రికా మిస్ చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్-8 దశలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే.. సూర్య సేన తర్వాతి మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ అప్పటికే జింబాబ్వేపై విజయం సాధించడంతో సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి. అదే సమయంలో విండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడించడం టోర్నీలో మలుపు తిరిగింది. దాంతో భారత్ అవకాశాలు మెరుగు కాగా.. జింబాంబ్వే, విండీస్‌పై గెలిచి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించి.. టీ20 వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Also Read: IPL 2026: ఐపీఎల్‌ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!

‘వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నీ నుంచి బయటికి వచ్చేది. కానీ సఫారీలు ఆ మ్యాచ్ గెలిచారు. దాంతో భారత్‌కు అవకాశం దక్కింది. పెద్ద టోర్నీల్లో గెలవాలంటే బలమైన జట్లను తొందరగా బయటికి పంపించడం చాలా ముఖ్యం. టోర్నీలో అత్యుత్తమ జట్టును త్వరగా పంపిస్తేనే కప్ గెలవడానికి అవకాశాలు పెరుగుతాయి. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికా కోల్పోయింది. 2026 వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే’ అని స్టిక్ టు క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ అన్నారు. వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఐడెన్ కైల్ మార్క్‌రమ్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. సెమీఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.