Site icon NTV Telugu

Mahendra Singh Dhoni: విజయవాడలో ధోనీ విగ్రహం.. ఖుషీ అవుతున్న అభిమానులు

Mahendra Singh Dhoni

Mahendra Singh Dhoni

Mahendra Singh Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విజయవాడలో క్రికెట్ అభిమానులు ధోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం కనిపిస్తోంది. ప్రస్తుతం ధోనీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్‌కు విగ్రహం పెట్టడం బహుశా ఇదే తొలిసారని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అటు ధోనీ వచ్చే ఐపీఎల్‌లో కూడా ఆడనున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తన సారథ్యంలో ధోనీ ఎన్నోసార్లు టైటిల్ అందించాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవగా 2022 సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్‌లో సీఎస్‌కే మరోసారి విజృంభించి ధోనీకి గ్రాండ్ వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు

ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని రకాల ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సహా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. అటు టెస్టుల్లోనూ నంబర్‌వన్ ర్యాంకును సాధించింది. టీమిండియా తరఫున విజయవంతమైన కెప్టెన్ అంటే ధోనీ పేరు మాత్రమే గుర్తొస్తుంది. ధోనీ సారథ్యంలో కోహ్లీ, రోహిత్, రైనా, జడేజా, రాయుడు, ధావన్ లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మొత్తానికి విజయవాడలో ధోనీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారనే చెప్పాలి. కానీ విజయవాడలో ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది.

Exit mobile version