NTV Telugu Site icon

భారత్ – పాక్ : గత 5 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో జరిగింది ఇదే…!

దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్‌ వేదికల్లో తిరుగులేని భారత్‌…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్‌ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్‌…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్‌ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన.

ధనాధన్‌ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్. నరాలు తెగే ఉత్కంఠ మధ్య కీలక సమరం సాగనుంది. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌… ఐదు సార్లు తలపడ్డాయ్. ఒక్కటంటే ఒక్కసారి కూడా పాక్‌కు విజయం దక్కలేదు. ప్రతి మ్యాచ్‌లో భారత్‌ జట్టు ముందు…పాక్ తేలిపోతోంది. ఒత్తిడిని ఎదుర్కొలేక…చేతులేత్తేస్తోంది.

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎక్కువగా పాకిస్తాన్‌ గెలుపొందింది. అయితే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్‌కు…ఒక్క విజయం కూడా దక్కలేదు. మ్యాచ్‌ జరిగిన ప్రతిసారి టీమిండియాదే పైచేయి. వన్డే వరల్డ్‌కప్‌లు సహా టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో దాయాది జట్టుపై భారత్‌ ఆధిపత్యం చలాయించింది. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్‌ కప్‌లో…లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ తలపడ్డాయ్. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాలో ఉతప్ప 50, ఎంఎస్ ధోనీ 33 పరుగులు చేశారు. దీంతో 141/9 స్కోరు వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం లక్ష్య ఛేదనలో మిస్బాఉల్‌హక్ రాణించడంతో…141 పరుగులే చేయగలిగింది పాక్‌. మిస్బా రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ బౌలౌట్‌కు దారి తీసింది. బౌలౌట్‌లో మనవాళ్లు ముగ్గురు వికెట్లు పడగొట్టారు. వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, రాబిన్ ఉతప్ప వికెట్లు తీశారు. పాక్‌ బౌలర్లు మాత్రం విఫలమయ్యారు. దీంతో 3-0 తేడాతో బౌలౌట్‌లో టీమిండియా విజయం సాధించింది.

గ్రూప్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌ను గెలిపించినంత పని చేసిన మిస్బా ఉల్‌ హక్‌ ఫైనల్‌లోనూ… తన జట్టును విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే భారత్‌ ముందు తలవంచక తప్పలేదు. తుదిపోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ 75, రోహిత్ శర్మ 30 రాణించారు. అనంతరం 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 152 పరుగులకే ఆలౌటైంది.

ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. జోగిందర్ శర్మ తొలి బంతిని వైడ్‌ వేశాడు. రెండో బాల్‌కు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి వచ్చింది. అయితే జోగిందర్ వేసిన నాలుగో బంతిని మిస్బా స్కూప్‌ చేయగా.. షార్ట్ ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌ క్యాచ్‌ పట్టడంతో తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ సేన ముద్దాడింది.

2012లో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడ్డారు. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి… ఒంటి చేత్తో విజయాన్నందించాడు.

2014 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-10కి భారత్‌ చేరుకుంది. అదే గ్రూప్‌లో పాకిస్థాన్‌ ఉండటంతో మళ్లీ దాయాదుల పోరు తిలకించే భాగ్యం ప్రేక్షకులకు దక్కింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 131/7 స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం బ్యాటర్లు సమయోచిత ఇన్నింగ్స్‌లతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గ్రూప్‌లోనే టాప్‌లో నిలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌ ఫైనల్‌కు చేరింది. ఏడేళ్ల తర్వాత టైటిల్ నిరీక్షణకు తెరపడుతుందేమోనని భావించినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది.

2016లో భారత్‌ పాకిస్తాన్‌ మరోసారి తలపడ్డాయ్. సూపర్‌-10 గ్రూపు-2లో భాగంగా కోల్‌కతాలో జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా… బౌలర్లంతా మెరుగ్గా రాణించడంతో 118 పరగులకే దాయాదిని కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలో తడబడినప్పటికీ విరాట్‌ కోహ్లి అద్భుత హాఫ్‌ సెంచరీతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.