విమానయాన సంస్థ ర్యాన్ఎయిర్ సిబ్బందిపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సంచలన ఆరోపణలు చేశాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్ విమానాశ్రయంలో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో గేట్ సిబ్బంది నుంచి వివక్షపూరిత, బెదిరింపు ధోరణితో కూడిన ప్రవర్తన ఎదురైందని ఆరోపించాడు. సిబ్బంది మాట్లాడిన తీరు, నిబంధనలను అమలు చేసిన విధానం తనను తీవ్రంగా నిరాశపరిచాయని సోషల్ మీడియాలో వెల్లడించాడు. డబ్లిన్‌లో తనకు ఎదురైన తొలి చేదు అనుభవం ఇదేనని సంగా పేర్కొన్నాడు.
డబ్లిన్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని కుమార సంగక్కర బుధవారం (అక్టోబర్ 28) ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ‘డబ్లిన్‌లో ర్యాన్ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి ఎవరైనా వివక్షపూరిత ప్రవర్తనను ఎదుర్కొన్నారా?. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సిబ్బంది మాట్లాడిన తీరు, నిబంధనలను సక్రమంగా అమలుచేయకపోవడం, బెదిరింపులకు దిగినట్లుగా వ్యవహరించడం ఏ ప్రయాణికుడికీ ఆమోదయోగ్యం కాదు. చాలా బాధగా ఉంది’ అని పేర్కొన్నాడు. సాధారణంగా మైదానంలోనూ, బయటా ప్రశాంతంగా ఉండే సంగక్కర తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
సంగక్కర పోస్టుపై డబ్ల్యూఎస్‌ఓ2 సంస్థ సీఈఓ సంజీవ వీరవర్న స్పందించాడు. పాశ్చాత్య దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో తాను వివక్షను ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించాడు. దీనికి సంగక్కర స్పందిస్తూ.. స్వయంగా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు అది మనల్ని తీవ్రంగా కలచివేస్తుందని పేర్కొన్నాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే సంగక్కర చేసిన ఆరోపణలపై ర్యాన్ఎయిర్ సంస్థ ఇంకా స్పందించలేదు.

