Kiran More Questioned Ashwin Spot In Indian Squad for Asia Cup 2022: ఆసియా కప్-2022కి రవిచంద్రన్ అశ్విన్‌ను భారత జట్టులో చోటు కల్పించడంపై సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కిరణ్ మోరే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడినెలా ఎంపిక చేశారంటూ ప్రశ్నించిన ఆయన.. అశ్విన్‌కు బదులు షమీ లేదా అక్షర్ పటేల్‌ను సెలెక్ట్ చేయాల్సిందని సూచించారు. ‘‘అశ్విన్ ఎంపిక చేయడం నిజంగా షాక్‌కి గురి చేసింది. ఒకసారి అతడి ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ చూడండి, ఏమంత ఆశాజనకంగా లేదు. అతని స్థానంలో షమీ లేదా అక్షర్ పటేల్‌ని తీసుకోవాల్సింది. ఆ ఇద్దరిలో షమీ ఇంకా బాగా బౌలింగ్ వేయగలడు. ముఖ్యంగా.. అతడు కొత్త బంతితో మిడిల్ & స్లాగ్ ఓవర్స్‌లో వికెట్లు తీయగలడు’’ అని మోరే చెప్పుకొచ్చారు. గత వరల్డ్‌కప్‌లోనూ అశ్విన్‌ని ఎంపిక చేశారని, కానీ అప్పుడతడు ఆడలేదని గుర్తు చేశారు.
ఇదే సమయంలో.. భారత జట్టుకు హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు కావాలని కిరణ్ మోరే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దూసుకుపోతున్న అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘హార్దిక్ తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విధానం, 140-147 కి.మీట. వేగంతో బౌలింగ్ వేయడంతో పాటు.. కీలక సమయాల్లో బ్యాట్‌తోనూ పరుగులు చేస్తుండటం ఆకట్టుకుంది. ఇలాంటి ఆటగాళ్లు భారత జట్టుకి ఎంతో అవసరం’’ అని ఆయన తెలిపాడు. కాగా.. ఇంతకుముందు అశ్విన్‌ను టీ20 ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లో ఎంపిక చేయడంపై సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమచారి శ్రీకాంత్ కూడా ప్రశ్నించారు.