టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలని సెలక్టర్లకు కపిల్ దేవ్ సూచించాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని ప్రశ్నించాడు. అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు అని… అలాంటి ఆటగాడినే పక్కనపెట్టారని.. కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కపిల్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మునుపటిలా బ్యాటింగ్ చేయడం లేదని.. అతడు తన గత ప్రదర్శనల కారణంగా జట్టులో స్థానం సంపాదిస్తున్నాడని.. కానీ ఇది కరెక్ట్ కాదన్నాడు. జట్టులో స్థానం సంపాదించేందుకు ఎంతో మంది యువకులు పోటీ పడుతున్నారని.. విరాట్ కూడా జట్టులో స్థానం కోసం యువకులతో పోటీ పడాలని కపిల్ దేవ్ హితవు పలికాడు.
Read Also: IND Vs ENG: రాణించిన జడేజా.. రెండో టీ20లో ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..?
అటు యువకులు కూడా విరాట్‌ను అధిగమించాలని కపిల్ దేవ్ సూచించాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తే అతడిని దూరం పెట్టినట్లే పరిగణించాలని కపిల్ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ తీరుతెన్నులు చూస్తుంటే కోహ్లీ ఇదే ఆటతీరుతో ఎక్కువ కాలం కొనసాగలేడని, అతడిని కూడా జట్టు నుంచి తప్పించే పరిస్థితి కనిపిస్తోందని కపిల్ తెలిపాడు. అనేక ఆప్షన్‌లు ఉన్నప్పుడు ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా లాంటి ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని కపిల్ అన్నాడు. కాగా కోహ్లీ గత మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అటు ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ 16 మ్యాచ్‌లు ఆడి 115.98 సగటుతో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 11, 20 పరుగులతో విఫలమయ్యాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో టీ20లోనూ ఒక్క పరుగుకే అవుటయ్యాడు.