Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!

  • ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఇషాన్‌ కిషన్‌
  • 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్
  • సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు
Ishan Kishan Century

Ishan Kishan Century

ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన కిషన్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యం అని చెప్పుకొచ్చాడు.

అవార్డు సందర్భంగా ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ… ‘నిజాయితీగా చెప్పాలంటే ఆరంభంలో బంతి కాస్త స్వింగ్ అయింది. అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా సహాయపడింది. అభిషేక్ దూకుడు చూస్తే జట్టుకు ఏ మోమెంటం కావాలో స్పష్టంగా అర్థమవుతుంది. బంతిని జాగ్రత్తగా చూసి ఆడడమే నా పని. అదే ఈ రోజు నాకు కలిసొచ్చింది. జట్టంతా ఇప్పుడు ఒకే మైండ్‌సెట్‌లో ఉంది. మైలురాయి దగ్గర ఉన్నామని సింగిల్స్ తీసుకుంటూ ఆడితే.. తర్వాత పెద్ద షాట్లు కొట్టే అవకాశం కోల్పోయామనే భావన కలుగుతుంది. కాబట్టి బంతి కొట్టడానికి అనుకూలంగా ఉంటే.. ఎలాంటి భయం లేకుండా షాట్స్ ఆడాల్సిందే. జట్టు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం తప్ప.. వ్యక్తిగత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను’ అని చెప్పాడు.

‘ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు. నేను ఇంకా పూర్తి స్థాయిలో ఆటలేదని భావిస్తున్నా. నేను బాగా ఆడాను, అవార్డు కూడా వచ్చింది కానీ.. నా దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్‌ 2026పైనే ఉంది. వరల్డ్ కప్‌ లాంటి పెద్ద టోర్నీలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ మెగా టోర్నీలో కూడా జట్టుకు ఉపయోగపడటమే ఇన్నింగ్స్ ఆడాలి. అదే నా అసలైన టార్గెట్. ప్రస్తుతం భారత జట్టు బాగుంది. అందురూ బాగా ఆడుతున్నారు. తప్పకుండా టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని ఇషాన్ కిషన్ ధీమా వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ విఫలమైన నేపథ్యంలో కిషన్ ఓపెనింగ్ చేయడం ఖాయం అయింది.