Site icon NTV Telugu

Team India: బీసీసీఐకి షాక్.. సంజు శాంసన్‌కు ఇతర దేశం నుంచి ఆఫర్

Sanju Samson

Sanju Samson

Team India:  టీమిండియాలో ఇటీవల అన్యాయానికి గురైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ ఒక్కడే. టీ20లలో రాణిస్తున్నా టీ20 ప్రపంచకప్‌ కోసం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. పోనీ ఆ టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా శాంసన్‌కు పెద్దగా ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక్కటే మ్యాచ్‌‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. మళ్లీ ఆరో బౌలర్ కోసం శాంసన్‌ను పక్కనపెట్టారు. టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. అయితే పదే పదే విఫలమవుతున్న పంత్‌కు అవకాశాలు ఇస్తూ టాలెంట్ ఉన్న ఆటగాడిని పక్కనపెట్టడం అభిమానులకు నచ్చడం లేదు. దీంతో బీసీసీఐని శాంసన్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Read Also: Bangalore: అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3వేలు జరిమానా

తాజాగా టీమిండియాలో సరిపడా అవకాశాలు రాక శాంసన్ ఆవేదనకు గురవుతుండటంతో ఇతర దేశం నుంచి అతడికి ఆఫర్ వచ్చింది. శాంసన్‌కు ఐర్లాండ్ ఆహ్వానం పంపింది. తమ దేశం తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలని శాంసన్‌కు ఐర్లాండ్ దేశం కబురు పంపినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది. అన్ని వదిలేసి తమ దేశం వస్తే ఆడేందుకు అవకాశం ఇస్తామని ఐర్లాండ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐర్లాండ్ ఆఫర్‌ను సంజు శాంసన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను టీమిండియాకే ఆడతానని సంజు శాంసన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంజు శాంసన్ అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్ వంటి కీపర్లు అందుబాటులో ఉండటంతో శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే తాజా పరిణామం బీసీసీఐని షాక్‌కు గురిచేసేది అనే చెప్పాలి. ఐర్లాండ్ గుర్తించిన టాలెంట్‌ను బీసీసీఐ ఎందుకు గుర్తించడం లేదని శాంసన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version