Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?

  • అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం
  • విరాట్ కోహ్లీ ఆగ్రహం సరైందేనా?
  • ఎంసీసీ క్రికెట్ నిబంధనలు ఏమంటున్నాయి?
Virat Kohli Umpire Controversy

Virat Kohli Umpire Controversy

Virat Kohli fumes over Rajat Patidar Controversial Dismissal: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అర్షద్‌ ఖాన్‌ (3/22), రషీద్‌ ఖాన్‌ (2/19), జేసన్‌ హోల్డర్‌ (2/29) దెబ్బకు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40; 24 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌. మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్‌ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (43; 18 బంతుల్లో 4×4, 3×6), జోస్ బట్లర్‌ (39; 19 బంతుల్లో 2×4, 4×6) మెరిశారు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ (3/28) మూడు వికెట్స్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటీదార్‌ ఔట్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌ అవుట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ వేసిన 7.4 బంతికి పాటీదార్‌ భారీ షాట్ ఆడాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద జాసన్ హోల్డర్ క్యాచ్ పట్టగా.. అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. అయితే క్యాచ్‌ను అందుకునే క్రమంలో హోల్డర్‌ కిందపడ్డాడు. ఆ సమయంలో అతడు బంతిని కింద ఆనించినట్లు అనిపించింది. థర్డ్ అంపైర్‌ పాటీదార్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డగౌట్లో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. మ్యాచ్‌ అధికారితో వాదిస్తూ కనిపించాడు. మరోవైపు ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహానికి గురయ్యాడు. హోల్డర్ పూర్తిగా కంట్రోల్‌లో లేడని, క్యాచ్ సమయంలో బంతి నేలను తాకినట్లు కనిపిస్తోందని ఇద్దరు వాదించారు. ఈ సంఘటన మైదానంలో ఉద్రిక్తతను పెంచింది.

మరోవైపు క్రునాల్ పాండ్య కూడా ఆగ్రహంగా కనిపించాడు. మ్యాచ్ టెన్షన్ మధ్య ఈ వివాదం మరింత హీట్ పెంచింది. ఆటగాళ్ల భావోద్వేగాలు స్పష్టంగా బయటపడగా.. ఆర్సీబీ ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ‘ఔట్ లేదా నాట్ ఔట్?’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కొందరు అంపైర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం అది క్లియర్‌గా నాటౌట్ అని వాదిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగం, థర్డ్ అంపైర్ నిర్ణయాలు ఎంత ముఖ్యమో మరోసారి ఈ సంఘటన రుజువు చేసింది. మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ అంపైర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో ఇలాంటి తప్పిదాలు జరగకూడదని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ఆర్సీబీ మోమెంటమ్‌ను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు.

మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ అంశంపై స్పందించాడు. ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం.. క్యాచ్ పూర్తి కావాలంటే ఫీల్డర్ బంతి మీద మాత్రమే కాకుండా తన కదలికలపై కూడా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంసీసీ లా 33.3 ప్రకారం.. ‘క్యాచ్ అనేది ఫీల్డర్ బంతిని మొదట తాకినప్పటి నుంచి.. బంతి, తన కదలికలపై పూర్తి నియంత్రణ సాధించే వరకు కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం చూస్తే.. హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత డైవ్ చేసి స్లైడ్ అవుతున్న సమయంలో పూర్తి కంట్రోల్‌లో లేడని చోప్రా అభిప్రాయపడ్డాడు. టీవీ రీప్లేల్లో బంతి నేలను తాకినట్లు కనిపించిందని కూడా అన్నాడు. పటిదార్ నాటౌట్ అనే అభిప్రాయంను ఆకాష్ వ్యక్తం చేశాడు.